: మభ్య పెట్టొద్దు...నిజాలు మాట్లాడండి: మైసూరాకు సీఎం రమేష్ సవాల్
ప్రజలను వైఎస్సార్సీపీ మభ్యపెడుతోందని టీడీపీ నేత సీఎం రమేష్ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతలు అబద్దాలు చెప్పడం ఇప్పటికైనా మానాలని అన్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఎక్కువ ఓట్లు పోలైనట్టు ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఎన్నికల సంఘాన్ని అడిగి తెలుసుకోవాలని ఆయన వైఎస్సార్సీపీ నేతలకు హితవు పలికారు.
ఇప్పటి వరకు విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి టీడీపీ 121 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు, మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, పవన్ కల్యాణ్ మాటలను ప్రజలు విశ్వసించారని ఆయన తెలిపారు. ఇంకా కావాలంటే వైఎస్సార్సీపీ కేడర్ ను అడిగి క్షేత్రస్థాయి ఫలితాలపై అంచనాకు రావాలని ఆయన మైసూరాకు సూచించారు.