: ఈవీఎంలు భద్రపరిచిన చోట రాత్రి కొందరి సంచారం... ఆందోళనలో బెజవాడ టీడీపీ
కృష్ణా జిల్లా విజయవాడలో ఈవీఎంలు భద్రపరిచిన కానూరు సిద్ధార్థ కాలేజ్, పీవీపీ సిద్ధార్థ కాలేజి ప్రాంగణంలోకి రాత్రి 11.30 గంటల సమయంలో ఓ కారు వెళ్లింది. అందులో ఆరేడుగురు ఉన్నారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడి వాహనం కూడా సంచరిస్తోంది. దీంతో, అక్కడ అనుమానాస్పద పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే ఈ విషయాన్ని కొందరు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి చేరవేశారు. ఆయన వెంటనే కొంతమంది పోలింగ్ ఏజంట్లను పీవీఆర్ సిద్ధార్థ కాలేజి వద్దకు పంపారు.
వారు వెళ్లిన సమయంలో కళాశాల నుంచి ఓ అంబాసిడర్ కారు వెలుపలకు వస్తోంది. దీంతో, వారు కారును ఆపి తనిఖీ చేశారు. ఈ సమయంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి బదులుగా కారులోని వ్యక్తులు తాము తిరువూరుకు చెందిన రెవెన్యూ సిబ్బంది అని, ఎన్నికల విధులను నిర్వహిస్తున్నామని బదులిచ్చారు. కేశినేని అనుచరులు వారి ఐడెంటిటీ కార్డులను కూడా తనిఖీ చేశారు. అయితే, ఎన్నికల సిబ్బంది అయినంత మాత్రాన... ఈవీఎంలు భద్రపరిచిన చోట రాత్రి పూట హడావుడిగా తిరగాల్సినంత పనులు ఉండవు కదా? అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలు భద్రంగా ఉన్నాయా? లేదా? అనే అలజడి టీడీపీ శ్రేణుల్లో మొదలైంది.