: ఎన్డీయే 300 సీట్లు సాధిస్తుంది: వెంకయ్యనాయుడు
బీజేపీ తన మిత్ర పక్షాలతో కలసి 300 సీట్లను సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి కనిపించలేదని ఆయన ఎద్దేవా చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రెండంకెల స్థాయిని కూడా చేరుకోలేదని, ఆ స్థాయి వైఫల్యానికి కారణమేంటో ఆ పార్టీ సమీక్షించుకోవాలని ఆయన సూచించారు.
తమది మూడు సూత్రాల అజెండా అని, అభివృద్ధి సాధనే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. యూపీఏ చివరి క్షణాల్లో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల కేటాయింపుపై పార్టీలో నేతలంతా చర్చించిన తరువాతే నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. మీడియా కథనాలు ఊహాగానాలేనని, వాస్తవాలు కాదని ఆయన స్పష్టం చేశారు.