: నా పెళ్లి చేస్తానని చెప్పి... మాట తప్పారు: మహిళా వీఆర్వో
పెళ్లి చేస్తానని చెప్పి, మాట తప్పారంటూ ఓ మహిళా వీఆర్వో హైదరాబాదు, హయత్ నగర్ రెవెన్యూ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయిస్తానని ఒప్పుకొని... మాట నిలబెట్టుకోలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హయత్ నగర్ పోలీసులు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలంలో వీఆర్వోగా పనిచేసే వెన్నెల, హయత్ నగర్ మండలంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న వినయ్ లు ప్రేమించుకున్నారు. వినయ్ పెళ్లికి నిరాకరించడంతో వెన్నెల గతంలో హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వినయ్ సహచర ఉద్యోగులు వారిద్దరికీ వివాహం చేస్తామని హామీ ఇవ్వడంతో వెన్నెల తన ఫిర్యాదును వాపసు తీసుకున్నారు. రెండు నెలలు గడిచినా పెళ్లి చేయకపోవడంతో విసుగు చెందిన వెన్నెల వినయ్ తో పాటు హామీ ఇచ్చిన సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.