: రాష్ట్రానికి రానున్న కొత్త రాజధాని ఎంపిక కమిటీ
కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ తొలిసారిగా రాష్ట్రానికి రానుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కమిటీ పర్యటిస్తుంది. రెండు దశల్లో పర్యటనలకు వెళ్లాలని కమిటీ సభ్యులు నిర్ణయానికి వచ్చారు.
తొలి దశలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో కమిటీ పర్యటించనుంది. రెండో విడత ఒంగోలు, తిరుపతి, కర్నూలులో పర్యటిస్తుంది. రెండు, మూడు రోజుల పాటు పర్యటించి రాజధాని ఏర్పాటుకు అనువుగా ఉండే ప్రాంతాలపై అధ్యయనం చేయనుంది. శివరామకృష్ణన్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో రతిన్ రాయ్, అరోమర్ దేవి, జగన్ షా, రవీంద్రన్ సభ్యులుగా ఉన్నారు.