: ప్రజల్ని భయపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు: చంద్రబాబు
ఓడిపోతామనే భయంతో వైఎస్సార్సీపీ నేతలు ప్రజల్ని భయపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రజలపై, పోలీసు అధికారులపై, మీడియా ప్రతినిధులపై దాడులను ఖండిస్తున్నానని అన్నారు. టీడీపీ అభ్యర్థులు రాయపాటి, వెంకటరమణ, మరి కొందరు అభ్యర్థులపై ఇలాంటి దాడులు జరిగాయని, అది సరికాదని ఆయన అన్నారు.
రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా, ఇలాంటి దాడులు కేవలం కడపకు మాత్రమే పరిమితమై ఉండేవని... ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని ఆయన మండిపడ్డారు. జమ్మలమడుగులోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవన్నీ ఓటింగ్ శాతం తగ్గించేందుకు జరిగిన ప్రయత్నాలని ఆయన తెలిపారు. అయితే టీడీపీ శ్రేణుల ప్రయత్నం, ప్రజల విచక్షణతో పోలింగ్ శాతం తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు.
ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యంలో సరికాదని ఆయన సూచించారు. అరాచకాలన్నీ కడప, పులివెందులలో మాత్రమే చోటుచేసుకున్నాయని బాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా తయారు చేస్తారా? అని ఆయన నిలదీశారు. డబ్బులు విపరీతంగా పంచారని, ఈ సంస్కృతి రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 150 మంది పోలీసులను, 50 మంది టీడీపీ కార్యకర్తలను, 10 మంది మీడియా ప్రతినిధులను వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు గాయపరిచారని ఆయన తెలిపారు.