: వానర సైన్యాన్ని సిద్ధం చేసిన చైనా
అవును, మీరు చదివింది నిజమే. చైనాలో ఇప్పుడు కోతులతో ఓ బెటాలియన్ ను సిద్ధం చేస్తున్నారు. అక్కడి ప్రజా విముక్తి సైన్యం (పీఎల్ వో)కు వచ్చిన కొత్త ఆలోచనకు కార్యరూపమే ఈ ‘వానర సైన్యం’. బీజింగ్ కు సమీపంలో ఉన్న తమ ఎయిర్ బేస్ ను కాపాడుకోవడానికి ఈ వానర సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. తమ యుద్ధ విమానాలకు ముప్పు కలిగిస్తున్న పక్షుల గుంపును చెదరగొట్టేందుకు కోతులకు మించిన ఆయుధాలేమీ లేవని భావించి... కోతులకు శిక్షణ కూడా ఇచ్చారు. పక్షులు వచ్చినప్పుడల్లా వాటిని చెదరగొట్టడం ఇక కోతుల పని. అలాగే, చెట్ల మీద ఉన్న పక్షుల గూళ్లను కూడా ఈ వానరాలు పీకిపారేస్తాయి.
యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సమయంలో పక్షులతో ప్రమాదాలు కలుగుతున్నాయంటూ చైనా వైమానిక దళం ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. పక్షుల బారి నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో ఓ అధికారికి వచ్చిన ఆలోచనే ఈ వానర సైన్యం. వెంటనే వాటికి శిక్షణ ఇచ్చేవాళ్లను తీసుకొచ్చి, ఒక్కో కోతి చేత రోజుకు ఆరు చొప్పున పక్షి గూళ్లను ధ్వంసం చేయిస్తున్నారు. ఇలా తమ ఎయిర్ బేస్ పరిసర ప్రాంతాల్లో ఒక్క పక్షి కూడా లేకుండా చేయాలన్నది వాళ్ల ఆలోచన. ప్రస్తుతం ఈ వానర సైన్యం తమ పనిలో తలమునకలై ఉంది.