: ఆత్మవంచన చేసుకోకుండా ఓటు వేయండి: మోహన్ బాబు
సినీనటుడు మోహన్ బాబు చిత్తూరు జిల్లా రంగంపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన తల్లి, కుమారుడు విష్ణుతో కలసి వచ్చి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత చేతిలోనే వారి భవిష్యత్తు ఉందని... అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ధన ప్రవాహానికి అంతు లేకుండా పోయిందని... ఇదంతా ప్రజల సొమ్మే అని చెప్పారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టి ప్రజలకే పంచుతున్నారని ఆరోపించారు.
నేతల వాగ్దానాలు హద్దు మీరాయని... వాస్తవంగా వాటన్నింటినీ అమలు చేయడం అంత ఈజీ కాదని మోహన్ బాబు చెప్పారు. కొత్త రాష్ట్రంలో నేతలు చేపట్టాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలిపారు. ఓటర్లంతా ఆత్మవంచన చేసుకోకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇరుప్రాంతాల్లో ఎవరైతే రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించారో... వారి కుటుంబాలను ఆదుకోవాలని రెండు రాష్ట్రాలకు కాబోయే ముఖ్యమంత్రులను కోరుతున్నానని చెప్పారు.