: జన్మనిచ్చింది...మరణ శాసనం రాసిందీ కాంగ్రెస్సే: లగడపాటి
తనకు రాజకీయ జన్మనిచ్చింది, మరణశాసనం రాసింది కాంగ్రెస్ పార్టీయేనని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో లేకపోవడం కాస్త బాధగానే ఉందని అన్నారు. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ, సీమాంధ్రల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితం పూర్తిగా ముగిసిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రం ఒకటిగా ఉంటుందా?, రెండుగా విడిపోతుందా? అనేది తాను చెప్పలేనని, రాష్ట్రం ఒక్కటిగా ఉంటే టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు.
తానెప్పుడూ పార్టీకి నష్టం కలిగించలేదని, నిజాలు మాత్రమే చెప్పానని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయింది కనుక కేంద్రంలో, రాష్ట్రంలో అభివృద్ధి చేయగలిగిన పార్టీని ప్రజలు ఎన్నుకోవాలని ఆయన సూచించారు. కిరణ్ కుమార్ రెడ్డి అంటే ప్రజలకు విపరీతమైన సానుభూతి, ఇష్టం ఉన్నాయనీ, అయితే అది ఓట్లుగా మారుతుందా? లేదా? అనేది చూడాలని ఆయన తెలిపారు. నైతిక విలువలకు కట్టుబడి రాజకీయ సన్యాసం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.