: శామ్ సంగ్ కు 720 కోట్ల జరిమానా
యాపిల్ కంపెనీకి చెందిన రెండు పేటెంట్లను ఉల్లంఘించినందుకు ఆ కంపెనీకి శామ్ సంగ్ 119.6మిలియన్ డాలర్లు (రూ.720కోట్లు సమారుగా) చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. నెల రోజుల విచారణ అనంతరం క్యాలిఫోర్నియాలోని శాన్ జోస్ ఫెడరల్ కోర్టు ఈ తీర్పు జారీ చేసింది. స్మార్ట్ ఫోన్ లోని యూనివర్సల్ సెర్చ్ సహా పలు ఫీచర్లపై తమకున్న పేటెంట్లను శామ్ సంగ్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ యాపిల్ కోర్టుకెక్కింది. అయితే, తామెలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని శామ్ సంగ్ సమర్థించుకుంది.
హై ఎండ్ స్మార్ట్ ఫోన్లలో ప్రపంచ లీడర్లుగా ఉన్న యాపిల్, శామ్ సంగ్ మధ్య వివాదాలు మూడేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. పేటెంట్ల ఉల్లంఘనలపై రెండూ కంపెనీలు ఒకదానిపై మరొకటి కోర్టులను ఆశ్రయించాయి. స్ట్రీమింగ్ వీడియోకు చెందిన రెండు పేటెంట్లను యాపిల్ ఉల్లంఘించిందంటూ శామ్ సంగ్ కూడా కోర్టుకెక్కింది. యాపిల్ ఐఫోన్ 5ను నిషేధించాలని కూడా కోరుతోంది. దీనిపై విచారణ ఇంకా పూర్తి కాలేదు.