: తెలుగువారిని అవమానించడం కాంగ్రెస్ కి ఆది నుంచీ అలవాటే!: మోడీ
‘భారత్ మాతాకీ జై’ అంటూ మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 'సోదర సోదరీమణులకు నా నమస్కారాలు' అంటూ తెలుగులో చెప్పిన మోడీ అందర్నీ ఆకట్టుకున్నారు. గుంటూరులో ఎన్డీయే ఆధ్వర్యంలో జరుగుతోన్న బహిరంగ సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి పాల్గొని ప్రసంగించారు. ఆనాడు స్వాతంత్ర్యోద్యమంలో ఈ గడ్డ చూపిన స్ఫూర్తి అభినందనీయమని మోడీ అన్నారు.
దేశమంతా అధికారం కోసం ఎన్నికలు జరుగుతున్నాయని, కానీ సీమాంధ్రలో జరిగే ఎన్నికలు మాత్రం 'మీ తలరాతను మార్చే ఎన్నిక'లని నరేంద్ర మోడీ అన్నారు. తాను దేశమంతా తిరిగి ఇవాళ సీమాంధ్రకు వచ్చానని మోడీ అన్నారు. తెలుగువారిని అవమానించడం కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచీ అలవాటని ఆయన అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యను విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అవమానించారని, తెలుగువాడైన సంజీవరెడ్డిని రాష్ట్రపతి అవ్వకుండా ఇందిరాగాంధీ అడ్డుకున్నారని మోడీ చెప్పారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత పీవీ నరసింహారావుదే అని ఆయన అన్నారు.