: సోనియా, రాహుల్ లకు గుంటూరు మిర్చి ఘాటు చూపించాలి: చంద్రబాబు
గుంటూరులో జరుగుతోన్న ఎన్డీయే బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... కుట్ర రాజకీయాలు చేసేవారిని చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మన్మోహన్ రోబో మాదిరిగా మారిపోయారని, ఆయన్ను ప్రధానిగా ఎవరైనా ఒప్పుకుంటారా? అని ప్రజలను బాబు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తీరు చాలా దారుణమని, మన రాజధాని, నీటి గురించి ఏమీ చెప్పకుండానే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సోనియాగాంధీ, రాహుల్, మన్మోహన్ లకు గుంటూరు మిర్చి ఘాటు చూపించాలన్నారు.
కేసీఆర్ మాటల మరాఠీ అని, ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని బాబు దుయ్యబట్టారు. తెలంగాణలో కేసీఆర్ మోడీని, తనను, పవన్ కల్యాణ్ ను తిడుతున్నారని, ఆయన నోటికి తాళం వేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ప్రజల మధ్య విద్వేషాలు రేపి... రాజకీయం చేసే వారిని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపించి, మోడీని ప్రధానిని చేయాలని కోరారు. తనది, నరేంద్ర మోడీది అభివృద్ధి జోడీ అని బాబు చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం కమలం, సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.