: హంగ్ వస్తే టీఆర్ఎస్-కాంగ్రెస్ సర్కారే!
నేటి పోలింగ్ లో తెలంగాణలో ఏ పార్టీ స్థానమేంటో ఓటర్లు తేల్చనున్నారు. ప్రస్తుత పరిణామాలను బట్టి తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్-కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలతో దూషించుకొంటున్నా ఎన్నికల తర్వాత పొత్తుకు ఈ రెండు పార్టీలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, మొదటి నుంచీ ఈ రెండు పార్టీల మధ్యే సఖ్యత ఎక్కువ. పైగా ప్రస్తుతం కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై తార స్థాయిలో దూషణకు దిగినా, ఆయన సోనియాను అవమానించేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. పైగా తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ కావడమే గమనార్హం.
అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, టీఆర్ఎస్ కు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 60సీట్లు వస్తాయా? అన్నదే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 స్థానాల్లో టీఆర్ఎస్ కు గట్టిగా రెండు స్థానాలు కూడా లభించడమే కష్టమని రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట. ఇక ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో ఒక్కటీ వచ్చే పరిస్థితి లేదు. నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో మూడు లేదా నాలుగు స్థానాలకు మించి టీఆర్ఎస్ కు రాకపోవచ్చని అంచనా. మరి ఇలాంటి పరిస్థితులలో టీఆర్ఎస్ మెజారిటీ మార్కుకు కొద్ది దూరంలో ఆగిపోతే కాంగ్రెస్సే ఆ పార్టీకి దిక్కన్నది విశ్లేషణ.
టీఆర్ఎస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... టీఆర్ఎస్ కు 50 స్థానాల వరకు వస్తే ఎంఐఎం, సీపీఐల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇంకా తక్కువైతే కాంగ్రెస్ సహకారంతో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే యోచనలో ఉన్నారు.