: దానం బండతప్పుల అనువాదం
రాహుల్ గాంధీ ప్రసంగాన్ని హిందీలోంచి తెలుగులోకి అనువదించి చెబుతానంటూ ముందుకు వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ పరువు తీశారు. రాహుల్ మాటలను బండ తప్పులుగా అనువదించారు. దీంతో సభకు హాజరైన వారు కొందరు దానం తప్పులను తెలుసుకుని నవ్వుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో రాహుల్ సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహల్ ప్రసంగం ప్రారంభించే ముందు ఎవరు అనువదిస్తారని వేదికపై ఉన్న నేతలను అడిగారు. కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యన్నారాయణ ముందుకు వచ్చారు. కానీ, తానే చేస్తానంటూ దానం నాగేందర్ గట్టిగా కోరడంతో రాహల్ సరేనన్నారు.
హిందీలో రాహుల్ ప్రసంగం మొదలైంది. దానం దాన్ని తర్జుమా మొదలుపెట్టారు. యూపీఏ పాలనలో 15కోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటకు తీసుకొచ్చామని రాహుల్ అంటే, 1500 కోట్ల మందిని తీసుకొచ్చామని దానం అనువదించారు. ప్రపంచ జనాభాయే 700కోట్లు! భూసేకరణ చట్టంలో మార్పులతో... భూమి సేకరించినప్పుడు ఇచ్చే పరిహారాన్ని నాలుగు రెట్లు పెంచామని రాహుల్ అంటే... పరిహారం తగ్గించామని దానం పేర్కొన్నారు. హైదరాబాద్ అందరిదీ, అన్ని ప్రాంతాల వారికీ ఇక్కడ రక్షణ ఉంటుందని రాహుల్ అంటే, దానం కేవలం సీమాంధ్రగా చెప్పేశారు. రాహుల్ ఉద్దేశం దేశంలోని అన్ని ప్రాంతాల వారిది హైదరాబాద్ అని! ఇలాగే కొన్ని తప్పులు, కొన్ని అసలుకే అనువదించకపోవడం.. మొత్తానికి ఎరక్కపోయి ఇరుక్కున్నారు దానం.