: బాలీవుడ్ నటులపై ఉగ్రవాదుల గురి
దేశంలో బాంబు పేలుళ్ల ద్వారా ఎన్నో రక్తపాతాలకు కారణమైన ఇండియన్ ముజాహిదీన్ సంస్థ... బాలీవుడ్ నటులపై గురి పెట్టింది. అధిక సంఖ్యలో హాజరయ్యే వేడుకలు వంటి సందర్భాల్లో ఆత్మాహుతి దాడుల ద్వారా పెద్ద ఎత్తున రక్తపాతం సృష్టించడానికి వ్యూహ రచన చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల విచారణలో ఆ సంస్థ అధిపతి తెహ్ సీన్ అక్తర్ అలియాస్ మోను వెల్లడించాడు. అశ్లీలత, ఇతర విషయాలను చూపించడం ద్వారా బాలీవుడ్ పరిశ్రమ యువతను చెడగొడుతోందని అతడు తెలిపాడు. అందుకే బాలీవుడ్ రంగానికి చెందిన నటీనటులు అధిక సంఖ్యలో హాజరయ్యే సందర్భాల్లో దాడులు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు. ఒక్కదాడితోనే పెద్ద ఎత్తున నష్టం కలిగించాలని భావించామని అతడు చెప్పిన షాకింగ్ నిజాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలువురు నటీనటులకు వ్యక్తిగతంగా బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.