: రాష్ట్రంలో విద్యుత్ కోతలు తగ్గుతున్నాయ్!
రాష్ట్రంలో విద్యుత్ కోతలు తగ్గనున్నాయి. దీంతో వేళాపాళా లేని విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్న గ్రామీణ ప్రాంతాల వారికి ఈ వేసవిలో కొంతమేరకు ఉపశమనం లభించనుంది. విద్యుత్ డిమాండ్ తగ్గుముఖం పట్టిన తర్వాత లభ్యత పెరగడమే ఇందుకు కారణం. ఇటీవలి కాలంలో పరిశ్రమలకు కూడా వారంలో ఒకరోజు పవర్ హాలిడేను అమలు చేశారు. ఒకవైపు జిందాల్ ప్రాజెక్టు నుంచి ఆశించినంత కరెంట్ రాకపోవడం, ఇంకోవైపు కృష్ణపట్నం థర్మల్ కేంద్రం నుంచి కనీసం 250 మెగావాట్ల కరెంట్ రాకపోవడంతో విద్యుత్ లభ్యత కష్టమైంది.
ఎన్టీపీసీలో ఎవరికీ కేటాయించని 550 మెగావాట్లను ఇవ్వాలని కేంద్ర విద్యుత్ శాఖను ట్రాన్స్ కో కోరింది. అయితే, హర్యానా నుంచి అధిక రేటుతో విద్యుత్ కొనుక్కోమంటూ కేంద్రం సలహా ఇచ్చింది. రాష్ట్రానికి 276.83 మెగావాట్లను అమ్మేందుకు ఎన్టీపీసీ అంగీకరించింది. అలాగే జిందాల్ ప్రాజెక్టు నుంచి మరో 300 మెగావాట్ల పవర్ రావడంతో... గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు తగ్గిస్తామని ట్రాన్స్ కో వర్గాలు తెలిపాయి.