: షానన్ మ్యాగీ.. కుంభకర్ణుడికి కజిన్ సిస్టర్..!
ఎవరైనా అతిగా నిద్రపోతే, వీడెవడ్రా కుంభకర్ణుడిలా ఉన్నాడు.. అని వ్యాఖ్యానించడం పరిపాటి. పురాణకాలం నాటి ఆ మహానుభావుడు నిద్రకుపక్రమించాడంటే ఏళ్ళ తరబడి సుషుప్తిలోకి జారుకుంటాడు. చెవి పక్కన బాకాలు ఊదినా ఆ భారీకాయుడిని నిద్ర లేపడం అసాధ్యమని విన్నాం. సరిగ్గా అలాంటి వ్యక్తే ఇంగ్లండ్ లోనూ ఉందట.
ఆమె పేరు షానన్ మ్యాగీ. బోల్టన్ నగర నివాసి అయిన ఈ పందొమ్మిదేళ్ళ పడుచు ఒక్కసారి పడుకుంటే రోజులకొద్దీ లేవదు. వారాలపాటు అలా నిద్రదేవి ఒడిలో సేదదీరుతుంది. నిద్రలో పడి ఎన్నో మధురానుభూతులను సైతం దూరం చేసుకుంది. పుట్టిన రోజు, పండుగలు, పరీక్షలు.. ఇలా ఎన్నో కోల్పోయిందట. ఈ అతినిద్రకు కారణం క్లైవ్ లెవిన్ సిండ్రోమ్ అని తెలుస్తోంది. ఈ అత్యంత అరుదైన సిండ్రోమ్ తో బాధపడుతున్న షానన్ ఒక్కోసారి ఇంట్లోవాళ్ళను కూడా మర్చిపోతుంది. ఎందుకంటే, ఈ సిండ్రోమ్ కారణంగా మతిమరుపు కూడా ప్రాప్తిస్తుందట.
ఇక షానన్ తల్లిదండ్రులు ఆమె గురించి చెబుతూ, నిద్ర ముంచుకొచ్చిందంటే తానెక్కడున్నదీ పట్టించుకోదని తెలిపారు. కాలేజి, బార్.. ఇలా ఎక్కడంటే అక్కడే నిద్రపోతుందని చెప్పారు. లవర్ తో డేటింగ్ కు వెళ్ళి అక్కడా ఇలాగే మత్తులోకి జారుకుందని ఆమె తల్లి జూలీ వెల్లడించింది. భోజనం కూడా నిద్రావస్థలోనే స్వీకరిస్తుందని ఆమె తెలిపారు.