: వానర సేనను తరిమేసిన వారికే ఓటేస్తాం
అక్కడి కోతులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కొంప ముంచేలా ఉన్నాయి. అవును మరి, కోతులను తరిమేసిన వారికే ఓటేస్తాం అని అక్కడి ప్రజలు చెప్పటంతో... ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో అభ్యర్థులు తలపట్టుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు అదే ప్రధాన అంశమై పోయింది. తమ పొలాలపై పడి వానరాలు నానా రభస చేస్తున్నాయని, వాటి వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, కోతులను తరిమేసే వారికే తాము ఓటేస్తామంటూ అక్కడి వారు తెగేసి చెబుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా, బిలాస్ పూర్, మండి, చంబా తదితర ప్రాంతాల్లో కోతులు పెరిగిపోయాయి. కోతులతో పాటు ఇతర జంతువులు పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. అక్కడ 80 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. దాదాపు నాలుగు లక్షలకు పైగా కోతులు పంటపొలాల్లో ప్రవేశించి నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీంతో, ప్రతి యేటా సుమారు రూ.500 కోట్ల పంట నష్టం జరుగుతోంది. దాంతో ఈ కోతులను ఎలాగైనా వెళ్లగొట్టాలని ఎన్నికల ప్రచారానికొచ్చిన అభ్యర్థులను కోరుతున్నారు.
ఈ వానర సేనపై ఇప్పుడు ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి పెట్టాయి. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని బీజేపీ సలహానిస్తుండగా, వానరాలకు స్టెరిలైజేషన్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీనిస్తోంది. ఇక సీపీఎం అయితే కోతులను చంపేందుకు అనుమతి కోసం కోర్టును ఆశ్రయించింది.