: అమెరికన్లకు ఒబామా యోగా మంత్రం


బీ హెల్దీ... బీ యాక్టివ్ ... బీ యు.. ఇది అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కొత్త మంత్రం. యోగా చేయండి. ఆరోగ్యంగా ఉత్సాహంగా జీవించండి అంటూ ఒబామా దంపతులు కంకణం కట్టకుని మరీ అమెరికన్లకు హితబోధన చేస్తున్నారు. ఇందుకోసం వారు ప్రత్యేకంగా అధ్యక్ష భవనంలోని  పార్క్ లో యోగా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈస్టర్ పండుగ సందర్భంగా సోమవారం ఇది జరగనుంది. దీనికి సంబంధించి పోయిన వారమే వైట్ హౌస్ ప్రజలకు ముందస్తు ప్రకటన చేయడం విశేషం. వైట్ హౌస్ లో ఇదే మొదటి సారి కాదు, ఏటా ఈస్టర్ ఎగ్ రోల్ (ఈస్టర్ మరుసటి రోజు) నాడు యోగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. 

ఒబామా 2009లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక, లీ కల్లిస్ యోగా శిక్షకురాలిగా నియమితులయ్యారు. అసలు తన ఆరోగ్య మంత్రం యోగాననే చెబుతారు ఒబామా. ఒబామా ప్రచారంతోపాటు యోగా వల్ల కలుగుతున్న సానుకూల ఫలితాలను చూసి అమెరికన్లలో నేడు చాలా మంది దీని పట్ల మక్కువ చూపుతున్నారు. యోగాకు అభిస్తున్న అపూర్వ అదరణ చూసి అక్కడి సంప్రదాయ వాదులలో గుబులు పట్టుకుంది. ఇది హిందూవాదాన్ని ప్రోత్సహించడమేనంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. 

కానీ, వీరి అభ్యంతరాలను అమెరికన్లు చాలా మంది పెద్దగా పట్టించుకోవడం లేదు. యోగాకు ఉన్న పవరే దీనికి కారణం. అందుకే అక్కడ కొన్ని స్కూళ్లలో యోగా పాఠాలు కూడా నేర్పుతున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ కొంత మంది పిల్లల తల్లిదండ్రులు శాన్ డిగో కోర్టులో ఒక కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ గురువారం జరగనుంది. ఈ కేసును విచారించనున్న జడ్డి కూడా యోగాను పాటిస్తున్నవారు కావడం విశేషం. 

అయితే, యోగాను మతంతో ముడిపెట్టడాన్ని ఒబామా కార్యాలయం వ్యతిరేకిస్తోంది. అమెరికన్లు ఆరోగ్యంగా జీవించడానికి శారీరక వ్యాయామం అవసరమని, అందుకోసం యోగాను పాటించాలని సూచిస్తోంది. యోగాను యూనివర్సల్ లాంగ్వెజ్ గా చెబుతోంది. రోజూ లక్షలాది మంది అమెరికన్లు యోగా చేస్తూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని ఆనందంగా ఉండగలుగుతున్నారని.. అందుకే యోగాను ప్రోత్సహిస్తున్నామని వైట్ హౌస్ ప్రకటన జారీ చేసింది. 

  • Loading...

More Telugu News