: మెదక్ జిల్లా ఓటర్లకు బంపర్ బహుమతులు!
ఓటింగ్ శాతం పెంచేందుకు మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సభర్వాల్ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 'ఓటు వేయండి నానో కారు గెలుచుకోండి' అని చెబుతున్నారు. ఇలా జిల్లాలో 90 శాతం ఓటింగ్ జరిగేలా ఆమె కృషి చేస్తున్నారు. ఓటు వేసిన వారు పోలింగ్ కేంద్రంలో ఏర్పాటుచేసే ప్రత్యేక బాక్సులో ఓటరు స్లిప్ వేయాలని సూచించారు. 95 శాతానికి పైగా ఓటింగ్ నమోదైన గ్రామీణ ప్రాంతాలు, 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైన పట్టణ ప్రాంతాల బూతులను కలిపి బంపర్ డ్రా తీస్తారట.
ఇందులో గెలుపొందిన ఓటరుకు నానో కారు బంపర్ ప్రైజుగా ఇస్తామని కలెక్టర్ స్మిత వెల్లడించారు. ఇక ఏదైనా గ్రామంలో 95 శాతం ఓటింగ్ నమోదైతే ఆ గ్రామంలో ఓటేసిన వారిలో డ్రా ద్వారా 12 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికీ 12వందల రూపాయల నగదు బహుమతి ఇస్తారు. దీంతో పాటు 95 శాతానికి పైగా ఓటింగ్ నమోదైన గ్రామాలకు కార్పోరేట్ల సామాజిక బాధ్యత నిధి నుంచి రెండు లక్షల నజరానా ఇస్తామని చెప్పారు.
ఓటు వేసినట్లు ఇంకు గుర్తు చూపిస్తే లీటరు పెట్రోల్ పై రూపాయి తగ్గిస్తారు. ఇంకా ఓటేసిన వారు వ్యవసాయ సబ్ మెర్సిబుల్ పంపు సెట్లు, రిఫ్రిజిరేటర్లు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్ టాప్ లు, వాషింగ్ మెషిన్ లు, హోండా యాక్టివా స్కూటర్లు గెలుచుకోవచ్చు. ఇలా పలువురుకి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం వల్ల సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.