: అక్కడ మూడు అడుగుల గుంతలో నీరు ఊరుతోంది!


అనంతపురం జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వందలాలి అడుగుల లోతు బోర్లు వేయించినా చుక్కనీరు రావడం లేదు. నీటి కోసం ఇటు రైతులు, అటు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పక్కన ఎండలు మండుతుంటే... మెట్ట ప్రాంతంలో మూడు అడుగులు తవ్విన గుంతలో నీరు ఊరుతోంది. ఆ నీటిని చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని పి.నారాయణపురంలో బండారు గోపాల్ అనే రైతు తన పొలంలో మామిడి మొక్కలు నాటేందుకు మూడు అడుగుల చొప్పున గుంటలు తవ్వించడం మొదలుపెట్టాడు. అందులో ఒక గుంటలో రెండు అడుగులు తవ్వగానే నీటి తేమ కనిపించింది. మరో అడుగు తవ్వగానే నీరు ఉబకడం ప్రారంభమైంది. సగం గుంటకు వచ్చిన నీటిని బయటకు తోడేశారు. అయితే, ఆ గుంటలో ఇవాళ మళ్లీ నీరు ఊరడం మొదలుపెట్టింది. ఊట నీరు తియ్యగా ఉన్నట్లు స్థానికులు చెప్పారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా విన్న గ్రామస్థులు నీటిని చూసేందుకు తరలివస్తున్నారు. ఈ ప్రాంత రైతులు మీడియాతో మాట్లాడుతూ... ఈ భూమికి కొద్ది దూరంలో ఒక వంక ఉన్నదని, అయితే అక్కడ చుక్క నీరు కూడా లేదని చెప్పారు. కానీ, ఇక్కడ ఊహించని రీతిలో గుంటలో నీరు ఊరటం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.

  • Loading...

More Telugu News