: అక్కడ పనిచేసేందుకు 5 లక్షల మంది నిర్మాణ కూలీలు కావలెను!
గల్ఫ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ లో నిర్మాణ కూలీల కొరత రియల్ ఎస్టేట్ రంగాన్ని పట్టి పీడిస్తోందని ఓ మీడియా నివేదికలో వెల్లడైంది. 2015 సంవత్సరం నాటికి నిర్మాణ కూలీల కొరత భారీగా పెరిగే అవకాశం ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. 2015 నాటికి 5 లక్షల మంది నిర్మాణ కూలీల కొరత ఉంటుందని సర్వేల్లో వెల్లడైంది. ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీ (డీఐఏసీ), డెల్లాయిట్ కన్సల్టెన్సీ ఓ సర్వే నిర్వహించాయి.
పబ్లిక్, ప్రైవేట్ ప్రాజెక్టులకు ఊహించని డిమాండ్ ఏర్పడటంతో నిర్మాణ రంగంలోని అన్ని విభాగాల్లో కూలీలు, ఇతర సాంకేతిక నిపుణుల కొరత ఏర్పడింది. డిజైన్ ఇంజనీరింగ్, మధ్య స్థాయి నిపుణుల అవసరం ఉంటుందని మల్టీ నేషనల్ కంపెనీలు తెలిపాయి. వరల్డ్ ఎక్స్ పో 2020 నిర్వహించేందుకు దుబాయ్ బిడ్ గెలుచుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగానికి భారీగా డిమాండ్ పెరిగింది.
భారీగా నిర్వహించే వరల్డ్ ఎక్స్ పో 2020 కు 45 వేల హోటల్ గదుల అవసరం ఉంటుందని హెచ్ ఎస్ బీసీ బ్యాంక్ తెలిపింది. వరల్డ్ ఎక్స్ పో 2020 కోసం 3.40 బిలియన్ డాలర్ల మేరకు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పనులు నిర్వహించాల్సి ఉంటుందని, అందుచేత స్కిల్డ్ లేబర్ కు యూఏఈలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు.