: బీ సైలెంట్... ఇది కేసీఆర్ మాట!
రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని కేసీఆర్ అన్నారు. చేవెళ్ల ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని, 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని అన్నారు. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాలీలపై రవాణా పన్ను రద్దు చేస్తామని అన్నారు. వృద్ధులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలు ఫించను ఇస్తామని తెలిపారు.
హైదరాబాదుకు ఒక ఎయిర్ పోర్టు సరిపోదని, మరో విమానాశ్రయాన్ని తెస్తామని ఆయన అన్నారు. రెండు కోట్ల మంది ప్రజలు హైదరాబాద్ వస్తారని, అప్పుడు చేవెళ్ల భూములు 20 కోట్ల రూపాయల ధర పలకనున్నాయని ఆయన తెలిపారు. ఇంతలో సభలో నుంచి వ్యాఖ్యలు వినిపించడంతో.. వారిని 'బీ సైలెంట్' అని గద్దించారు. హైదరాబాద్ లో సిలికాన్ వ్యాలీ కంటే గొప్ప సాఫ్ట్ వేర్ పార్కును అభివృద్ధి చేస్తామని తెలిపారు.
చైనాలోని హార్డ్ వేర్ పార్కు కంటే గొప్పదాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్లు కష్టపడుతున్నందున వారికి రవాణా పన్ను నుంచి విముక్తి కల్పించి, వేధింపులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. 'ఇది కేసీఆర్ మాట' అని ఆయన తెలిపారు.