: ఉత్తమ్ కుమార్ రెడ్డికి విలువల్లేవు: షర్మిల
మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్ఆర్ కే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని ఆమె విమర్శించారు. అలాంటి వ్యక్తి ప్రజలకు వెన్నుపోటు పొడవకుండా ఎలా ఉంటాడని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల ఇవాళ నల్గొండ జిల్లా నేరేడుచర్లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రతి వర్గానికి వైఎస్ రాజశేఖరరెడ్డి అండగా ఉండి భరోసా కల్పించారని షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో రూపాయి వడ్డీ రుణాలు ఉంటే... వైఎస్ హయాంలో పావలా వడ్డీ రుణాలు కల్పించారని ఆమె అన్నారు. 70 లక్షల మందికి ఫించన్లు, 47 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్ఆర్ దేనని షర్మిల చెప్పారు.