: ఉత్తరప్రదేశ్ లో గాలి-వాన... 18 మంది మృతి
ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో గాలి దుమారం, పెనుగాలులు రేగడంతో 18 మంది వ్యక్తులు మృతి చెందగా, తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. గురువారం నాడు 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు చెలరేగినట్లు వారు పేర్కొన్నారు. గాలుల తీవ్రత వల్ల ఇళ్లు, చెట్లు కూలి రాష్ట్ర రాజధాని, బారాబంకిలో ముగ్గురు, జాల్వాన్ లో 11 మంది, కాస్గంజిలో మరో ఇద్దరు, ఫైజాబాద్ లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
లక్నోలోని దుబగ్గర ప్రాంతంలో పాఠశాల గోడ కూలిపోయిన ఘటనలో ఓ రెండేళ్ల చిన్నారి సజీవ సమాధి అయ్యింది. చెట్లు విరిగిపడిపోవడంతో ఆరుకు పైగా రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఐదు వందలకు పైగా హోర్డింగులు విరిగిపడ్డాయి. 60కి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లక్నోలో 100 భారీ వృక్షాలు నేలకూలాయి. 15 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హార్ధోయ్ లో 15 మి.మీ, ముజఫర్ నగర్లో 14 మి.మీ., జాన్షీలో 4.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యల్లో తలమునకలైఉన్నారు.