: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసింది కాంగ్రెస్సే: సోనియా గాంధీ
నాలుగు కోట్ల మంది ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. ఈ రోజు కరీంనగర్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, సుదీర్ఘ ఎదురు చూపుల తరువాత ఇక్కడి ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందని అన్నారు. అమర వీరులకు, ఉద్యమకారులకు, తెలంగాణ సాధన కోసం అవిశ్రాంత కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలని ఆమె తెలిపారు.
తమ కలను సాకారం చేసుకోవడంలో తెలంగాణ వీరుల త్యాగాలు మరువలేనివని ఆమె శ్లాఘించారు. తెలంగాణ ప్రజలంతా తమ ఆందోళనను తెలియజేయడంలో సఫలీకృతులయ్యారని ఆమె కితాబిచ్చారు. కాంగ్రెస్ లేకుండా తెలంగాణ కల సాకారం కాలేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సంకల్పాన్ని పార్టీలన్నీ ఏకమై అడ్డుకున్నప్పటికి తాము అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని అన్నారు.
'నాలుగు కోట్ల మంది ఆకాంక్షను నేరవేర్చాం. ఇప్పుడు వారికి సాధికారత తేవాల్సిన బాధ్యత కూడా మాపై ఉంద'ని ఆమె చెప్పారు. సామాజిక న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. తెలంగాణలో దళితులు, గిరిజనులు, మహిళల రాజ్యం ఏర్పడాలని ఆమె సూచించారు. గాంధీ ఆశయాలకోసం ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలు అర్పించారని ఆమె అన్నారు.