: చాయ్ వాలాల మధ్య పోటీ పెంచిన మోడీ నామినేషన్
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో చాయ్ వాలాల మధ్య అనధికార పోటీ నెలకొంది. వారణాసిలో నరేంద్ర మోడీ ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తారా? అని చాయ్ వాలాలు, పాన్ డబ్బా వాలాలు ఎదురుచూస్తున్నారు. గుజరాత్ లోని వడోదర నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా మోడీ ఒక రాజవంశీకుడ్ని, ఒక చాయ్ వాలాను తన వెంట తీసుకెళ్లారు. దీంతో వారణాసిలో కూడా తమలో ఎవర్నో ఒకరిని తన వెంట తీసుకెళ్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి.
దీంతో స్థానికులు మోడీ వెంట నేను వెళ్తానంటే, నేను వెళ్తానంటూ పోటీ పడుతున్నారు. మరోవైపు కాశీ నగరాన్ని పాలించిన రాజవంశీయుల వారసుడు, బెనారస్ రాజు అనంత నారాయణ్ సింగ్ తో పాటు పాన్ వాలా, అలాగే పడవ నడిపే, లేదా చేనేత పని చేసే ముస్లిం వ్యక్తిని తన వెంట తీసుకెళ్తారని వార్తలు రాజ్యమేలుతున్నాయి. కాగా మోడీ నామినేషన్ కు సంబంధించి బీజేపీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.