: వడివేలు సినిమాను అడ్డుకుంటాం: తెలుగు సంఘాలు
ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలు నటించిన ‘జగజ్జాల బాహుబల తెనాలిరామన్’ సినిమాపై వివాదం ముదురుతోంది. ఇందులో వడివేలు శ్రీకృష్ణ దేవరాయలు, తెనాలి రామకృష్ణగా ద్విపాత్రాభినయం చేశారు. అయితే శ్రీకృష్ణ దేవరాయలు పాత్రను జోకర్ గా చిత్రీకరించడంపై చెన్నైలోని తెలుగు సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
అందుకు నిర్మాత నిరాకరించడంతో తెలుగు సంఘాల ఐక్యవేదిక తమ ఆందోళనను కొనసాగిస్తోంది. ప్రధాన పాత్ర పోషించిన వడివేలుకు వ్యతిరేకంగా తెలుగు సంఘాల ప్రతినిధులు ధర్నా చేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా ఉన్న ఈ సినిమాను కోర్టు ద్వారానైనా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు వినతిపత్రం సమర్పించారు.
మరోవైపు వడివేలుకు తమిళ చిత్రపరిశ్రమ అండగా నిలుస్తోంది. కళాకారుడైన వడివేలు జోలికి వస్తే తమిళులంతా ఒక్కటవుతారని నామ్ తమిళర్ కట్చి అధ్యక్షులు సీమాన్ తెలుగు సంఘాల వారిని హెచ్చరించారు.