: మేయర్ సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి...!
శునకం మేయర్ కావడమేమిటి విడ్డూరం కాకపోతేనూ... అనుకుంటున్నారా! కానీ, ఇది నిజం! అమెరికాలోని ఓ చిన్న పట్టణానికి మేయర్ గా ఓ శునకరాజం ఎన్నికైంది. అలాగని ఏదో దీన్ని ఏకగీవ్రంగా ఎన్నిక చేసేసుకున్నారని అనుకుంటే పొరపాటే. మరో ఆరు శునకాలు, ఒక గాడిద, ఒక పిల్లి, చివరకు మరో నక్క కూడా ఈ పోటీలో ఉన్నాయి. వాటన్నింటినీ పక్కకు నెట్టి ఈ బ్యాక్ హౌండ్ తరహా శునకం విజయం సాధించింది. పా కెటిల్ అనే ఈ కుక్కకు 2387 ఓట్లు వచ్చాయి. కినీ అనే ఓ నక్క కంటే దీనికి 55 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. దాంతో కుక్కను మేయర్ గాను, నక్కను డిప్యూటీ మేయర్ గా నియమించారు.
ఇదంతా అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో గల డివైడ్ అనే పట్టణంలో జరిగింది. ఈ పోటీలో 1790 ఓట్లతో మూడో స్థానంలో నిలిచిన బస్టర్ అనే పిల్లిని వైస్రాయ్ గా నియమించారు. మొత్తం 12,091 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో ఓటుతో పాటు ఒక డాలర్ ను విరాళంగా కూడా సేకరించారు. ఇంతకుముందు ఈ పట్టణానికి వాల్టర్ అనే పిల్లి మేయర్ గా ఉండేది. అది పదవీ విరమణ చేస్తుండటంతో ఈ కుక్క కొత్త మేయర్ కాబోతోంది.
మనుషులు మేయర్ కాకుండా జంతువులు కావడం ఏమిటా అనుకుంటున్నారా. ఇదంతా అధికారికంగా జరిగే తంతు కాదండి. అనధికారికంగా ఆన్ లైన్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఒక్కో ఓటుకు ఒక్కో డాలరు కూడా చెల్లించాలి. ఈ ఎన్నికల వల్ల జంతు రక్షణ కోసం నిధులను సమీకరించడమే కాకుండా... జంతువులకు హాని కలిగించకూడదనే మెసేజ్ ను కూడా ప్రజల్లో తీసుకెళుతున్నారు.