: బీజేపీలో కిషన్ రెడ్డి హవా తగ్గిందా?
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అధిష్ఠానం దగ్గర పలుకుబడి తగ్గిందా? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇందుకు సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైన దగ్గర్నుంచి వెంకయ్యనాయుడుకు దీటుగా, తెలంగాణలో సీనియర్ నేతలు ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ, విద్యాసాగరరావు ఉన్నప్పటికీ, వారికంటే పెద్దనేతగా, బీజేపీలో తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకున్న నేతగా కిషన్ రెడ్డి ఎదిగారు.
అన్ని నివేదికలు ఆయనే ఇచ్చేవారు. ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంతో చర్చలు జరిపేవారు. ఒక రకంగా తెలంగాణలో బీజేపీ అంటే కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి అంటే బీజేపీ అనేంతలా రాజ్యమేలారు. ఈ దశలో రాష్ట్రం రెండు ముక్కలు కావడంతో... తెలంగాణలో పార్టీ పగ్గాలతో పాటు అన్ని వ్యవహారాలను ఆయనే చక్కబెడతారని నమ్మిన పలువురు పార్టీ నేతలు ఆయనకు దగ్గరయ్యారు.
ఈ దశలో ఎన్నికలు రావడంతో టీఆర్ఎస్ తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుదామని, లేదా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రివర్గంలో పాగా వేద్దామని కిషన్ రెడ్డి ప్లాన్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జీవితంలో మజా ఏముంటుంది. అక్కడే బీజేపీ అధిష్ఠానం ఆయన ఆశలకు అడ్డుకట్ట వేసింది. టీడీపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించారని పేరున్న కిషన్ రెడ్డికి కోరుకున్న స్థానాన్ని కాక అంబర్ పేట స్థానాన్ని కేటాయించింది బీజేపీ.
ఆయనను నమ్మి బీజేపీలోకి వచ్చిన సంకినేని వెంకటేశ్వరరావు, పటాన్ చెరు అంజిరెడ్డి, సికింద్రాబాద్ ఆలుగడ్డ శ్రీనివాస్ కు టికెట్లు దక్కలేదు. కిషన్ రెడ్డి వర్గంగా ముద్రపడిన నారాయణపేట నేత రతన్ పాండురెడ్డి, మక్తల్ కొండయ్యకు కూడా పార్టీ సీట్లు కేటాయించలేదు. కాగా మరో వైపు కిషన్ రెడ్డి చెక్ పెడదామనుకున్న ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ, విద్యాసాగర్ రావుకు టికెట్లిచ్చింది. దీంతో కిషన్ రెడ్డి మౌనం దాల్చారు. కిషన్ రెడ్డి మౌనం తుపాను ముందర నిశ్శబ్దం లాంటిదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.