: మాజీ మంత్రి పుత్రరత్నం.. ఓ కార్ల దొంగ!
బీహార్లో ఓ మాజీ మంత్రి తనయుడు కార్ల దొంగతనానికి పాల్పడి పోలీసులకు దొరికిపోయాడు. సమస్తి పూర్ జిల్లాలోని బేలారి గ్రామం వద్ద.. దొంగలించిన వాహనాలతో ఈ మంత్రిగారి పుత్ర రత్నం పట్టుబడ్డాడు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ మంత్రి వర్గంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన రమేశ్ సాహ్ని కుమారుడు ముఖేశ్ సాహ్ని తన అనుచరుడు గంగా ప్రసాద్ సింగ్ తో కలిసి బేలారి గ్రామంలోని ఓ గ్యారేజి వద్ద అనుమానాస్సదంగా కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన పోలీసులు గ్యారేజి వద్దకు రాగా, అక్కడ ఓ కారు, పికప్ వ్యాన్ తో ఇద్దరూ పట్టుబడ్డారు. పైగా ఆ వాహనాలకు నకిలీ నెంబర్ ప్లేట్లను అమర్చినట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తన కుమారుడు అమాయకుడనీ, ఈ వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి రమేశ్ సాహ్ని ఆరోపిస్తున్నారు.