: అమర్ సింగ్ ఆస్తి వంద కోట్లు!!
అమర్ సింగ్... ఆస్తి ఎంతో తెలుసా? అచ్చంగా వంద కోట్లు! ఫతేపూర్ సిక్రీ స్థానం నుంచి రాష్ట్రీయ లోక్ దళ్ తరపున లోక్ సభకు పోటీ చేస్తున్న అమర్ సింగ్.. తనకు, తన భార్యకు కలిపి వంద కోట్ల ఆస్తి ఉందని ప్రకటించారు. బ్యాంకు డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడి, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు కలిపి రూ. 41.34 కోట్ల చరాస్తులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఓ భాగస్వామ్య సంస్థలో రూ. 12.23 కోట్ల పెట్టుబడి, లెక్సస్, మారుతి స్విఫ్ట్ కార్లు, 8.68 లక్షల విలువైన బంగారం, 28 కిలోల వెండి పాత్రలు ఉన్నాయి. ఇంకా ఫర్నీచర్, వాచీలు, పెయింటింగులు.. వీటన్నింటి విలువ రూ. 64.40 లక్షలు. ఆయన భార్యకు 21.95 కోట్ల చరాస్తులున్నాయి. తనకు చేతిలో పది లక్షల నగదు, తన భార్యకు ఐదు లక్షల నగదు ఉన్నట్లు అమర్ సింగ్ ప్రకటించారు. అమర్ సింగ్ కు నోయిడా, లక్నో, బెంగళూరు ప్రాంతాల్లో ఇళ్లు, భూములు ఉన్నాయి.