: తొగాడియా వ్యాఖ్యలపై విచారణకు కేంద్రం ఆదేశం


విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా ఒక వర్గం వారిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విచారణ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. చట్టాలను ఉల్లంఘించినట్లు తేలితే తొగాడియాపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు వెళ్ళాయి.
తొగాడియా వ్యాఖ్యలు విద్వేషపూరితంగా వుంటే ఆయనపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ మీడియాతో చెప్పారు. మరోవైపు తొగాడియా ప్రసంగాల నిర్ధారణకు మహారాష్ట్ర పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు వుంటాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, బొకారో పట్టణంలో జనవరి 22న ఒక సభ జరిగింది. ఇందులో విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా పాల్గొని ప్రసంగించారు.
లోగడ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు తొగాడియ ఆ సందర్భంగా బదులిచ్చారు. “గతంలో పోలీసులు పక్కన వుంటే ఏం జరిగిందో చూశారుగా.. వేలాది శవాలు బయటపడ్డాయి. అందులో ఒక్క హిందువూ లేడు” అని తొగాడియా వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే ఒక ముస్లిం వ్యాపారి హైదరాబాద్ లోని కంచన్ బాగ్ పోలీసు స్టేషన్లో తోగాడియాపై బుధవారం ఫిర్యాదు చేసారు.

కాంగ్రెస్ వోటుబ్యాంకు రాజకీయాలకు ఈ సంఘటనే నిదర్శనం. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేసినప్పుడు అతనిపై విచారణ చేయాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించలేదు. ఇప్పుడు మాత్రం ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యలపై విచారణ జరపాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది.

  • Loading...

More Telugu News