: టీఆర్ఎస్ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం?
సినీ నటుడు, కేంద్ర మంత్రి చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ ఓ టీఆర్ఎస్ అభ్యర్థి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? ఇప్పటి వరకూ ఎవరి కోసమూ ఎన్నికల ప్రచారం చేయని ఈ యువ హీరో తొలిసారి ఆ బాధ్యతలు చేపడతారా? అన్న ఆసక్తి సినీ, రాజకీయ వర్గాల్లో నెలకొంది. అల్లు అర్జున్, స్నేహారెడ్డిని 2011లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. స్నేహ తండ్రి కంచర్ల శేఖర్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాన్ని తాజాగా కేటాయించింది. దీంతో తన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనమని ఆయన అల్లుడు అర్జున్ ను కోరవచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే, అల్లు అర్జున్ మామయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నేతగా ఉండడం, మరో మామయ్య పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఏం నిర్ణయం తీసుకుంటారా? అన్న ఉత్సుకత నెలకొంది. నిజానికి శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున నల్లగొండ జిల్లా మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. టికెట్ కోసం కేంద్ర మంత్రి చిరంజీవిని సైతం కలిసి చర్చించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకు టికెట్ లభించలేదు. దీంతో శేఖర్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ లో చేరడం, ఆయనకు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్ కేటాయించడం జరిగిపోయాయి.