: ఆయన తప్ప నన్నెవరూ, ఏమీ చేయలేరు: కేజ్రీవాల్
తనకు ప్రాణహాని ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని సుల్తాన్ పురిలో ఎన్నికల ప్రచారంలో జరిగిన దాడి ప్రత్యర్థుల కుట్రలో భాగమేనని ఆయన అన్నారు. తనపై దాడి జరిగినా, సెక్యూరిటీ ఏర్పాటును అంగీకరించేది లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
‘కుట్రలో భాగంగానే దాడి జరిగింది. నిందితులు అరెస్ట్ అయినా మళ్లీ దాడులకు పాల్పడుతారు’ అని కేజ్రీవాల్ అన్నారు. తనను లక్ష్యంగా చేసుకునే దాడి ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. ఏఏపీతో ఇతర పార్టీలు అభద్రతాభావానికి గురవుతున్నాయని ఆయన అన్నారు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై మళ్లీ దాడులు జరుగుతాయని, తమలో ఎవరో ఒకరు చనిపోతారని కూడా ఆయన అన్నారు.
‘దాడి జరిగినా సెక్యూరిటీ అక్కర్లేదు... సెక్యూరిటీ సిబ్బందిని అనుమతించే ప్రసక్తే లేదు’ అని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. "దేవుడు అనుకుంటే తప్ప నేను చావను. అంతేతప్ప నన్నెవరూ చంపలేరు" అని ఆయన తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని సుల్తాన్ పురిలో కేజ్రీవాల్ పై దాడి జరిగిన విషయం విదితమే.