: ఫేస్ బుక్ అకౌంట్ ఉంటే... చెప్పి తీరాలి!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులకు సామాజిక వెబ్ సైట్ల (ఫేస్ బుక్, ట్విట్టర్ వంటివి) లో ఖాతాలు ఉన్నట్లైతే, సదరు అకౌంట్ల వివరాలను అఫిడవిట్ లో తప్పనిసరిగా పేర్కొనాల్సిందేనని సికింద్రాబాదు లోక్ సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, హైదరాబాదు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. అలాగే, నామినేషన్ దాఖలు చేయదలచిన అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు ఆగకుండా ముందుగానే తమ పత్రాలు దాఖలు చేయాలని ఆయన కోరారు.
సికింద్రాబాదు లోక్ సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ నిమిత్తం సుమారు 50 మంది నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారని ఆయన చెప్పారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను, మద్దతుదారుల ఓటు నెంబర్లను నిశితంగా పరిశీలించేందుకు కొంత సమయం పడుతుందని, చివరి నిమిషంలో హడావిడిగా తెస్తే పరిశీలన సాధ్యం కాదని ఆయన అన్నారు. అభ్యర్థుల పత్రాల పరిశీలన నిమిత్తం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సిబ్బందిని అందుబాటులో ఉంచామని, వారి సేవలను వినియోగించుకోవాలని జేసీ శ్రీధర్ కోరారు.