: కన్న కూతుళ్లను అమ్మేసిన కర్కోటక తండ్రి
రక్తం పంచుకు పుట్టిన బిడ్డలనే కన్న తండ్రి అమ్మేశాడు. ఈ అమానుష ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని చాతకొండ పంచాయతీ డ్రైవర్స్ కాలనీకి చెందిన పాషా ఎప్పుడూ గొడవ పడుతుండడంతో విసుగు చెందిన భార్య కిరోసిన్ పోసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన జరిగిన మూడు నెలలకే ఉన్న ఇద్దరు ఆడపిల్లలను పోషించలేక పాషా వారిద్దరినీ చెరో ఐదు వేల రూపాయలకు అమ్మేశాడు.
అయితే పిల్లలు కనిపించడం లేదని, వారు ఎక్కడున్నారని ఇరుగుపొరుగు వారు అడిగితే... అత్తగారింట్లో వదిలి వచ్చానని అబద్ధం చెప్పాడు. ఈ క్రమంలో అత్తింటివారు పిల్లలను తీసుకెళ్లేందుకు రావడంతో, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారులను విక్రయించిన విషయం తెలుసుకున్న కాలనీ వాసులు కోపంతో పాషాకు దేహశుద్ధి చేసి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.