: ముఖ్యమంత్రితో వేదిక పంచుకున్న హత్యకేసు ముద్దాయి
ముఖ్యమంత్రితో ఓ హత్యకేసు నిందితుడు వేదిక పంచుకున్నాడు. గత డిసెంబర్ నుంచి వెతుకుతున్న హంతకుడు ముఖ్యమంత్రితో కన్పించగానే నివ్వెరపోయిన పోలీసులు తేరుకుని, వేదిక దిగగానే అతనిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్ లోని గయ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పనిచేసిన జావెద్ ఖాన్ అనే వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో నిందితుడు. గత ఏడాది డిసెంబరులో గయ న్యాయస్థానం అతనిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇన్నాళ్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న జావెద్ ఖాన్ నిన్న ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నాడు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో వేదిక పంచుకుని జిగేల్ మన్నాడు. అయితే, వేదిక దిగగానే పోలీసులు ఆయనను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టారు.