: అంతరిక్షానికి షార్ట్ కట్..!
హైదరాబాద్ నుంచి చెన్నైకి షార్ట్ కట్ ఉంటుందని తెలుసు, అయితే భూమి నుంచి అంతరిక్షానికి కూడా షార్ట్ కట్ ఉంటుందని వింటేనే ఆశ్చర్యం కలుగుతోంది కదూ? అయితే ఇది నిజం. నిన్న కజకిస్తాన్ లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి నింగికెగిసిన సోయుజ్ క్యాప్సూల్ కేవలం 5 గంటల్లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వాస్తవానికి ఈ రోదసీ ప్రయాణానికి 45 గంటలు పడుతుందట. నిజంగానే ఇది షార్ట్ కట్ కదూ?
ఈ యాత్రలో ఇద్దరు రష్యా కాస్మోనాట్లు, ఓ అమెరికన్ ఆస్ట్రోనాట్ పాలుపంచుకున్నారు. గతంలో ఈ యాత్రలకు రెండ్రోజులు పట్టడం గమనించిన రష్యా శాస్త్రవేత్తలు మరింత సునాయాస ప్రయాణానికి అనువైన మార్గాలను కనుగొనడంలో మూడేళ్ళుగా తలమునకలై ఉన్నారట. ఎట్టకేలకు ఈ షార్ట్ కట్ మార్గం వారికో దారి చూపిందనుకోవాలి.
దీనికి తోడు సోయుజ్ వాహక నౌక సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపర్చడం, అత్యాధునిక కంప్యూటర్ నియంత్రణ, డిజిటల్ కమాండ్ వ్యవస్థ.. ఇవన్నీ కూడా అంతరిక్ష ప్రయాణ కాలాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషించాయని ఇగోర్ లిసోవ్ అనే అంతరిక్ష నిపుణుడు అంటున్నారు.