: ‘క్షీర స్నానాలు’... పాల కంపెనీ కొంప ముంచాయ్!
పాల పదార్థాల ఉత్పత్తులను తయారుచేసే కంపెనీ ఉద్యోగులందరూ స్వీట్లు, చాకొలెట్లు తయారుచేసేందుకు ఉపయోగించే టబ్బుల కొద్దీ పాలల్లో స్నానాలు చేయడం రష్యాలోని ఒక చీజ్ ఫ్యాక్టరీ కొంప ముంచింది. ఉద్యోగులు తమ క్షీర స్నానాలను వీడియో తీసి యూట్యూబ్ లో కూడా అప్ లోడ్ చేసేశారు. ఇంకేముంది, ఆ వీడియోను వీక్షించిన ప్రజలు కంపెనీ ఉత్పత్తులు కొనడం ఆపేశారు. దాంతో అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి.
ఇప్పుడు సైబీరియా ప్రాంతంలోని ఓమ్క్స్ అనే చోట ఉన్న ఈ కంపెనీ ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రష్యన్ ప్రభుత్వం ఈ కంపెనీ మీద విచారణకు ఆదేశించింది. "ఈ పాలతోనే కంపెనీ పాల ఉత్పత్తులను తయారుచేస్తోందన్నది నిజం. కాబట్టి దర్యాప్తు జరిపి దోషులను శిక్షించడం ఖాయం" అని ఒక అధికారి వ్యాఖ్యానించాడు.
ఆరుగురు ఉద్యోగులు ఒంటిపై షర్ట్స్ తప్ప మరేమీ లేకుండా ఈ పాల తొట్టెలో మునిగి తేలుతూ విక్టరీ సింబల్ ను చూపిస్తున్న ఆ వీడియోలను యూ ట్యూబులో ఇప్పటికే మూడు లక్షల మంది చూశారు. ఓమ్క్స్ చీజ్ కంపెనీ ఏటా 49 టన్నుల చీజ్ ను తయారు చేసి విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ పాల స్నానాలు ఫ్యాక్టరీ యాజమాన్యానికి ప్రాణసంకటంగా మారింది.