: మెట్రో రైలు పనితీరుపై కోర్టు మెట్లెక్కుతాం: కంట్రీ క్లబ్
హైదరాబాదులోని మెట్రో రైలు నిర్మాణంపై సీబీఐ దర్యాప్తును కోరాలని కంట్రీ క్లబ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్) నిర్ణయించింది. గతంలో బేగంపేటలో ఉన్న సీసీఐఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని పాక్షికంగా కూలగొట్టినందుకు హైదరాబాదు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)కు సీసీఐఎల్ నోటీసు ఇచ్చింది. సీసీఐఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ రెడ్డి హైదరాబాదులో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. హెచ్ఎంఆర్ఎల్ పనితీరుకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు జరపాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన అన్నారు.
‘‘హెచ్ఎంఆర్ఎల్ పనితీరులో ఎలాంటి పారదర్శకత లేదు. నిజానికి పలు నిర్మాణాలను కూల్చాల్సి ఉంది. కానీ ఆశ్చర్యంగా వాటిని కూల్చాల్చిన నిర్మాణాల జాబితా నుంచి తొలగించారు’’ అని రాజీవ్ రెడ్డి అన్నారు. హెచ్ఎంఆర్ఎల్ కంట్రీ క్లబ్ నిర్మాణాన్ని కావాలనే లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆరోపించారు.