: హెచ్ 1బి వీసాలు.. హాట్ కేకులు
అగ్రరాజ్యంలో తాత్కాలిక కొలువుల కోసం జారీ చేసే హెచ్1 బి వీసాలకు ఈసారి అమితాదరణ కనిపిస్తోంది. 2008 ఆర్థిక మాంద్యం తరువాత క్రమంగా అమెరికా ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుండడంతో అక్కడికి వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి మొదలుకానున్న దరఖాస్తుల స్వీకరణ ఐదురోజులలోనే ముగిసే అవకాశం ఉంది.
అమెరికాలో ప్రతీ అక్టోబర్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇందుకోసం హెచ్ 1 బి వీసాలకు దరఖాస్తులను ఏప్రిల్ 1 నుంచి స్వీకరిస్తారు. పోయిన ఏడాది హెచ్ 1 బి వీసాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే కోటా పూర్తి కావడానికి జూన్ 11 వరకూ పట్టింది. కానీ ఈ సారి జారీ చేయనున్న 65వేల వీసాలకు దరఖాస్తులు ఐదురోజులలోనే భారీగా వచ్చేస్తాయంటున్నారు. పైగా అధిక ఆదరణ కారణంగా వీసాల జారీకి లాటరీ వేయక తప్పేలా లేదు. 2008లోనే చివరిసారిగా హెచ్ 1బి వీసాల జారీకి లాటరీ ప్రక్రియ అనుసరించారు.
ఎల్1 వీసాల జారీపై సందేహాలు ముసురుకోవడంతో కంపెనీలు తమ ఉద్యోగులను అమెరికాకు పంపేందుకు హెచ్1 బి వీసాలనే నమ్ముకున్నాయని సమాచారం. ఈ వీసాల ద్వారా విదేశీయులను అమెరికా కంపెనీలు తాత్కాలికంగా పనిలోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. భారత్ లో ఉన్న అమెరికా అనుబంధ ఐటీ కంపెనీలు ఈ వీసా కోటాను అధికంగా వినియోగించుకుంటున్నాయి.