: నగ్మాకు ప్రచారంలో తలనొప్పులు తప్పనున్నాయా?
రాజకీయ అరంగేట్రం చేసిన సినీ నటి నగ్మాకు ఎన్నికల ప్రచారంలో కష్టాలు తప్పేలా లేవు. అభిమానుల పేరిట వెంటపడే ఆకతాయిల చేష్టలతో ఆమె భయపడిపోతున్నారు. ప్రచారంలో మరీ శ్రుతి మించి ప్రవర్తించిన ఓ వ్యక్తిని ఇటీవల ఆమె చెంప చెళ్లుమనిపించిన విషయం విదితమే. మరోవైపు సొంత పార్టీ నేతలతోనూ నగ్మాకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగిన ఆమె, ప్రచారమైతే ఆర్భాటంగా ప్రారంభించారు, కానీ ఆది నుంచి ఆమెకు అన్నీ కష్టాలే. అందుకే ఇప్పుడు రక్షణ కోసమని ఆమె సొంతంగా బౌన్సర్లని ఏర్పాటు చేసుకున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటుతో ప్రచారానికి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.
సినీతారగా ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టిన నగ్మా, ఇప్పుడు అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దానికి తోడు సొంత పార్టీకి సంబంధించిన యూపీ ఎమ్మెల్యే ఒకరు నగ్మా చేతిని గట్టిగా పట్టుకుని, దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆమె ఎలాగో తంటాలు పడి విడిపించుకుపోయారు. వెళ్లిన ప్రతిచోటా ఇటువంటి సమస్యే ఎదురవుతోందని ఆమె వాపోతున్నారు. ఈ విషయాలను ఆమె కాంగ్రెస్ పార్టీకి వివరించింది. కాగా, తమ అభ్యర్థి రక్షణకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఈసీని కోరింది. తగిన రక్షణతో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని ఆమె నిశ్చయించుకున్నారు.
ఇదిలా ఉండగా నగ్మా ఇప్పుడు మాట మార్చారు. తాను కొంతమందిపై చెయ్యి చేసుకున్నట్లు, తననెవరో ముద్దుపెట్టుకున్నట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. తానెవరినీ కొట్టలేదని, తననెవరూ ముద్దుపెట్టుకోలేదని నగ్మా స్పష్టం చేశారు. తన మీదకు వచ్చిన వారిని మాత్రమే తాను పక్కకు తోసేశానని తాజాగా నగ్మా వివరణ ఇచ్చారు.