: 'పోల్' వార్ షురూ... తొలి ఘట్టానికి నోటిఫికేషన్ నేడే
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నేడు తొలి ఘట్టం ప్రారంభంకానుంది. తొలి దశ ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాలకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. అంటే, తొలిదశ ఎన్నికలు జరగనున్న తెలంగాణ ప్రాంతంలో 'పోల్' వార్ కు తెరలేవనుంది. మొత్తం 17 లోక్ సభ స్థానాలు, 119 శాసనసభ నియోజకవర్గాలకు ఒకే దఫా నోటిఫికేషన్ వెలువడనుంది.
9వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 12వ తేదీ. రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం... రాష్ట్రం మొత్తం మీద 6,41,01,895 మంది ఓటర్లు నమోదయ్యారు. వీరిలో 3,22,03,786 మంది పురుషులు, 3,18,46,785 మంది మహిళా ఓటర్లు. ఇతరులు 5,213 మంది కాగా, సర్వీసు ఓటర్లు 46,110 మంది. ప్రవాస భారతీయ ఓటరుగా ఒక వ్యక్తి నమోదు అయ్యారు.