: కొత్త మలుపు తిరిగిన 'అనూహ్య ఎస్తేర్' హత్య కేసు
ముంబైలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన టీసీఎస్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ 'ఎస్తేర్ అనూహ్య' హత్య కేసు మరో మలుపు తిరిగింది. హంతకుడ్ని పట్టుకున్నామని ఘనంగా ప్రకటించి, కథలు అల్లిన ముంబై పోలీసుల గుట్టురట్టైంది. అనూహ్య హత్య కేసులో అరెస్టయిన చంద్రభాన్ సనప్ డీఎన్ఏ అనూహ్య శరీరంలో దొరికిన డీఎన్ఏతో సరిపోలడం లేదు. దీంతో ఈ కేసు మళ్లీ మొదటికి వచ్చింది. మరోసారి దీనిపై దర్యాప్తు చేపట్టనున్నారు.
దీంతో ఈ కేసు ఎప్పటికి కొలిక్కి వస్తుందోనని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గతేడాది డిసెంబర్ లో క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చిన ఎస్తేర్ అనూహ్య జనవరి మొదటి వారంలో ముంబై చేరుకుని కుంజ్ మార్గ్ లో హత్యకు గురైంది. జాతీయ స్థాయిలో సంచలనం రేకిత్తించడంతో ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముంబై పోలీసులు చంద్రభాన్ సనప్ ను నిందితుడిగా తేల్చారు. ఇప్పుడు అతని డీఎన్ఏ కూడా సరిపోలకపోవడంతో కేసు మరోసారి మొదటికి వచ్చింది.