: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన రిజర్వ్ బ్యాంక్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన మానిటరీ పాలసీలో రెపోరేటుతో పాటు రివర్స్ రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు రెపోరేటు 8 శాతంగా ఉండగా రివర్స్ రెపోరేటు 7 శాతంగా ఉంది. భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకే కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పుచేర్పులు చేయలేదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈరోజు (మంగళవారం) ముంబయిలో వెల్లడించారు. అయితే అవసరమైనప్పుడు తగిన చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు.
ఇంతకు ముందు మానిటరీ పాలసీలో కీలక వడ్డీ రేట్లను 7.75 శాతం నుంచి 8 శాతానికి పెంచిన విషయం విదితమే. గతేడాది నవంబర్ లో 11.24 శాతం పెరిగి ద్రవ్యోల్బణం ఇప్పడిప్పుడే నియంత్రణలోకి వస్తోందని రాజన్ అన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 4.5 శాతానికి తగ్గిందని, ఈ ఆర్థిక సంవత్సరం అది 4.9 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది.