: మున్సిపల్ ఫలితాలపై విచారణ వాయిదా
మున్సిపల్ ఎన్నికల ఫలితాల వాయిదాపై విచారణను రాష్ట్ర హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఫలితాల వెల్లడిపై ఇవాళ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఏప్రిల్ 10వ తేదీలోగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయమని గతంలో తామిచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నామని కోర్టు తెలిపింది. ఏప్రిల్ 10వ తేదీ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయమని గతంలో తామిచ్చిన ఆదేశాలను సవరించలేమని కూడా కోర్టు స్పష్టం చేసింది.
అయితే ఆర్టికల్ 32 ప్రకారం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించే అధికారం దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఉందని, అదే నిబంధనల ప్రకారం హైకోర్టు కూడా చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల సంఘం వైఖరి తెలపాలని కూడా కోర్టు సూచించింది. దాంతో షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు ప్రకటిస్తామని ఈసీ కోర్టుకు విన్నవించింది.
ఇక, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టులో తాము ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల తేదీని రీ షెడ్యూల్ చేయాలని మాత్రమే ‘సుప్రీం’ను కోరామని తెలిపింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై సుప్రీం తీర్పు మున్సి‘పోల్స్’ ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపదని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది.