: సూళ్లూరుపేట టీడీపీ టికెట్ ఎవరికి దక్కేను?
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. దీంతో, రానున్న ఎన్నికల్లో టీడీపీ అభర్థిగా పోటీ చేసేందుకు ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొని ఉంది. గతంలో ఒకసారి మంత్రిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పరసా రత్నం, ఇటీవలే వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేలవల సుబ్రహ్మణ్యంతో పాటు ఎప్పట్నుంచో టీడీపీనే అంటిపెట్టుకున్న నాగురయ్యలు ఇక్కడ నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు.
వీరిలో పరసా రత్నం గత కొంతకాలంగా స్థానికంగా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో, ఆయన ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నేలవల సుబ్రహ్మణ్యం విషయానికొస్తే... ఆయన వైకాపా నుంచి ఇటీవలే టీడీపీలోకి వచ్చారు. దీనికితోడు, ఇప్పటికీ పార్టీలోని అన్ని వర్గాలవారితో సత్సంబంధాలు నెలకొల్పుకోలేకపోయారనే వాదన వినిపిస్తోంది. ఇక మూడో వ్యక్తి నాగురయ్య ఉద్యోగిగా ఉన్నప్పటి నుంచి టీడీపీకి సేవచేశారు. ఉద్యోగ విరమణ చేసినప్పటినుంచి పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడంలో ఆయన పాత్ర విస్మరించలేనిదని పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కష్టకాలంలో కూడా పార్టీకి సేవ చేసిన నాగురయ్యకే సూళ్లూరుపేట టికెట్ దక్కే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం.