: పాత కరెన్సీ నోటు= 26,000 బ్యాక్టీరియా క్రిములు
డబ్బు చెడ్డదా..? అంటే, చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే, అది ఎవరి చేతుల్లో ఉంటుందో, వారి స్వభావాన్ని బట్టి ఆ డబ్బుకు లక్షణాన్ని ఆపాదించవచ్చు. మంచి వ్యక్తుల వద్ద కష్టపడి సంపాదించిన సొమ్మే ఉంటుంది. అక్రమార్కుల వద్ద ఉన్న సొమ్ముకు అవినీతి మట్టే అంటుకుని ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం చర్చించుకునే డబ్బుకు వేల సంఖ్యలో సూక్ష్మ క్రిములు అతుక్కుని ఉంటాయి. ఎందుకు, ఏమిటి, ఎలాగంటారా..!?.
కరెన్సీ నోట్లు చేతులు మారడం సహజమే కదా. అలా ఒకరి వద్ద నుంచి మరొకరి వద్దకు చేరుకునే క్రమంలో వారి చేతులకున్న బ్యాక్టీరియాలు ఆ నోట్లను అంటిపెట్టుకుని ఉంటాయట. ఎంతలా అంటే, ఒక్కో నోటుపై సుమారు 26,000 బ్యాక్టీరియాలు తిష్ఠ వేసుకుని ఉంటాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 1000 మందిపై సర్వే నిర్వహించడం ద్వారా ఈ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
బస్సుల్లో రెయిలింగ్ లు పట్టుకోవడం ద్వారా, ఎస్కలేటర్ల వద్ద, లైబ్రరీలోనూ చేతులకు మట్టి అంటుకుంటుందని, ఆ చేతులతో కరెన్సీ నోట్లు పట్టుకోవడంతో అవి మలినం అవుతాయని సదరు అధ్యయనం చెబుతోంది. ఇలాంటి నోట్లు వ్యాధులను సంక్రమింపజేస్తాయని కూడా ఆ అధ్యయనం వెల్లడిస్తోంది.