: ఇవాళ్టి నుంచి విశాఖకు ఎయిర్ కోస్టా విమాన సర్వీసులు
విజయవాడ కేంద్రంగా విమానయాన సర్వీసులను అందిస్తోన్న ఎయిర్ కోస్టా శరవేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తన నూతన గమ్యస్థానం విశాఖపట్నానికి ఇవాళ్టి నుంచి విమానాలను నడుపుతోంది. హైదరాబాదు నుంచి బయలుదేరే తొలి విమానం విశాఖపట్నానికి ఉదయం 8.10 గంటలకు చేరుకున్నది.
ఇవాళ్టి నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు (డైరెక్ట్), విశాఖ నుంచి చెన్నైకు (వయా హైదరాబాదు), విశాఖ నుంచి బెంగళూరుకు (డైరెక్ట్), విశాఖ నుంచి జైపూర్ (వయా బెంగళూరు) విమాన సర్వీసులను నడిపించనుంది. సంస్థ సర్వీసుల నెట్ వర్క్ లో కొత్త గమ్యస్థానంగా విశాఖ చేరడం వల్ల ఎయిర్ కోస్టా మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సర్వీసులు, మంచి అనుభూతిని అందించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.